"మేము ఇక్కడ సంగీతం, నృత్యం సాధన చేస్తూ ఉంటాం."
అని ఒక అమ్మాయి వివరాలు చెబుతూ ఉంటుంది.
అప్పుడే, చాలా మంది అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయిని చూసి వాళ్లలో కొందరు అబ్బాయిలకు జెలసి వస్తుంది.
అబ్బాయిలు తమలో తాము గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు.
కాలి: "రే! ఎవడ్రా వాడు?! అంత మంది అమ్మాయిల మధ్యలో నవ్వుతూ తిరుగుతున్నాడు?"
ఆరు: "అవున్రా!! అమ్మాయిలతో నవ్వడం కాదు! అమ్మాయిలు ఓ తెగ పడి పడి నవ్వేస్తూ ఉన్నారు!"
సాంబ: "అందరం పుట్టినప్పటి నుంచి ఒకే ఊరిలో ఉన్నాం. మనల్ని చూస్తేనే కస్సు బస్సులాడుతూ ఉంటారు? ఎవడో ఏంటో తెలీకుండా అలా ఎలా కలివిడిగా ఉంటారు ఈ ఆడవాళ్లు?"
కాలి: "ఏమోరా! వాడు చూడటానికి చాలా బాగున్నాడు.. వాడు నవ్వుతుంటే నాక్కూడా వాడి వెనకాల తిరగాలని అనిపిస్తోంది.. నేను తేడా అయిపోయనా ఏంటి?"
అని అంటూ ఒకడు తల పట్టుకుంటాడు.
ఆరు: "ఛీ! నోర్ముయ్! తేడా నీలో కాదు! వాడిలో ఉంది! వాడి మొఖం చూస్తేనే తెలీట్లేదా?! చక్క గాడిలా ఉన్నాడు! హిహిహి.. పదా వెళ్లి వాడి పరువు తీసి అమ్మాయిల దృష్టిని మన వైపుకి తిప్పుకుందాం!"
అందరూ పిల్లలూ సరే అని తల ఊపుతూ, అమ్మాయిల దెగ్గరకు బయలుదేరుతారు.
కృష్ణ వాళ్ళను, వాళ్ళ ఆలోచనలను దూరం నుంచే గ్రహించి పసిగడతాడు. తన పెదవుల మీద నవ్వు ఉంటుంది.
ఆరు వెనక నుంచి వచ్చి కృష్ణను తల మీద చేత్తో తట్ట బోతాడు.
అతను తట్టబోయే క్షణం ముందు కృష్ణ వేగంగా వెనక్కి వంగి, తిరిగి నిలబడుతాడు.
అమ్మాయిలు అందరూ కృష్ణను కళ్ళతో తినేస్తూ చూస్తుంటారు.
కృష్ణ జుట్టు గాల్లో ఎగురుతుంటే అచ్చం సినిమా హీరోలా కనిపిస్తాడు.
అమ్మాయిలతో పాటుగా, అబ్బాయిలు కూడా నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ ఉండుంటారు.
అతను నవ్వుతుంటే స్వయంగా మన్మధుడు వాళ్ళ గుండెలో బాణం గుచ్చినట్టుగా అనిపిస్తుంది.
కృష్ణ: కొత్త మిత్రులారా. చెప్పండి ఏ పని మీద వచ్చారు?