తెలుగు నవల
రాక్షసుడు
_ఆడెపు మనోజ్
అతడి కళ్ళలో ఒక శక్తి వుంది!
ప్రపంచంలో మరే కళ్ళకీ లేని శక్తి అది! కేవలం అతడికి మాత్రమే వుంది.
అది మెస్మరిజమూ కాదు- హిష్నాటిజమూ కాదు. కేవలం సాధన ద్వారా వచ్చిన
శక్తి అది. సాధనంటే మళ్ళీ యోగమూ, ధ్యానమూ కావు. కష్టాలూ- చుట్టూ వుండే
రాక్షస మనస్తత్వాలూ- మోసం చేసిన మిత్రులూ, ఆఖరి క్షణంలో అదుకున్న
శత్రువులూ- వాళ్ళవల్ల అంగుళం దూరం వరకూ వచ్చి వెళ్ళిపోయిన అపాయాలూ-
పస్తులున్న రోజులూ- నిద్రలేని రాత్రులూ అన్నీ కలిసి అతడికి ఆ శక్తినిచ్చాయి.
ఒక్క నిముషం మాట్లాడితే చాలు, ఆ మాటల్లో అవతలి వ్యక్తి బలహీనతని
పట్టుకుంటాయి ఆ కళ్ళు. అదే వాటికున్న శక్తి.
డబ్బు – స్త్రీ… దైవభక్తి… కీర్తి కండూతి ….జూదం…. ప్రతీ మనిషికీ ఎక్కడో
ఏ మూలో ఒక బలహీనత వుంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకుంటాయి ఆ కళ్ళు.
ఆ తరువాత అతడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కిచ్చి, తనకి కావాల్సింది తను
తీసుకుంటాడు. అతడిలో గొప్పతనం ఏమిటంటే అతడు అవతలివారి బలహీనతని
గుర్తించినట్టు చులకనగా మాట్లాడడు.
అతడిలో ఇంకో గుణం కూడా వుంది. అతడు నవ్వడు. అవును. అతడు
నవ్వడు. అతడి జీవితంలో ఇంతవరకూ ఎప్పుడూ ఒక్కసారి కూడా నవ్వలేదు.
అతడి కోర్కె ఒకటే. ఇంకా ఇంకా సంపాదించాలి! అంతే.
అయితే అతడి ఆశయం సంపాదించటం కాదు. ఒకర్ని సంతృప్తిపరచాలి.
అలా సంతృప్తి పరిచి మరొకరి ఆచూకి తెలుసుకోవాలి.
-manoj